టీశాట్, దూరదర్శన్, యాదగిరి ఛానల్ ద్వారా పాఠాలు వినే అవకాశం కల్పించారు. ఆయా కళాశాలల యాజమాన్యాలకు ప్రభుత్వ ఆదేశాలను పంపించడంతో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నాయి. కళాశాలలను పూర్తిగా శానిటైజ్ చేయనున్నారు. అధ్యాపకులు భౌతిక దూరం పాటించడంతో పాటు, తప్పనిసరిగా మాస్కు ధరించేలా చర్యలు చేపట్టారు. నిత్యం అధ్యాపకులు ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. తరగతులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చేరవేసే విధంగా బాధ్యత వహించి, సందేహాలను నివృత్తి చేయనున్నారు. నిపుణులైన అధ్యాపకులు బోధించిన ఆన్‌లైన్ పాఠాలను ఇంటర్ బోర్డుకు పంపించారు. వీటికి అనుమతి లభిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారం చేయనున్నారు.
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి - శంకర్, జిల్లా నోడల్ అధికారి
ప్రభుత్వం నిర్వహించే ఆన్‌లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. అధ్యాపకులు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని రాసుకోవాలి. ఒకటికి రెండు సార్లు వినేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ గురించి ఇప్పటికే సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్‌కు సమాచారం అందించాం. సందేహాలు ఉంటే ఇబ్బంది పడకుండా అడగాలి. పిల్లలు శ్రద్ధగా పాఠాలు వినేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి.