వర్షం వల్ల తడిసిన ధాన్యం.. కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన 924 బస్తాల వరి ధాన్యాన్ని గత నెల 30న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సమీపంలోని ఓ రైస్‌మిల్‌కు లారీలో పంపారు. వరుసలో ఇతర లారీలు ఉండటంతో ఆ లారీని రైస్‌మిల్ ఎదుటే మూడు రోజుల పాటు నిలిపి ఉంచారు. ఇంతలోనే వర్షం పడి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి.
వర్షానికి తడిసిన ధాన్యాన్ని తాము తీసుకోమంటూ రైస్‌మిల్ యజమాని లారీని వెనక్కిపంపారు. ఆ లారీ ఆదివారం ఉదయం ధాన్యం బస్తాలతో కొనుగోలు కేంద్రానికి చేరుకుంది. ఇక్కడే అసలు వివాదం తలెత్తింది. లారీకి వారం రోజులకు రూ.లక్షకు పైగానే కిరాయి ఉంటుందని, ముందుగా ఆ డబ్బులు చెల్లిస్తేనే ధాన్యం బస్తాలు దింపుతామని లారీ డ్రైవర్ కొత్త పేచీ పెట్టారు. అంత డబ్బును ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ తలలు పట్టుకోవడం కేంద్రం నిర్వాహకుల వంతైంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తుంకిమెట్ల కొనుగోలు కేంద్రం బుక్‌కీపర్ నారాయణజీ తెలిపారు.
ఇదీ చూడండి: STEAM: అతిగా ఆవిరి పట్టడం అనర్థం