ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలతో కరోనా కట్టడిలో తెలంగాణ ముందుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వాక్సినేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మానవాళిని వేధించిన కరోనాకు చరమగీతం పాడేందుకు వాక్సిన్ దోహదపడుతుందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 139 కేంద్రాల్లో టీకా పంపిణీ చేస్తున్నట్లు తెలిపిన మంత్రి... తొలి దశలో 3.15 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకా వేయనున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని డీసీజీఐ ఆమోదం పొందిన వ్యాక్సిన్ మాత్రమే అందిస్తున్నట్లు వివరించారు. మొదటి డోసు వేసుకున్న వారికి 20 రోజుల తరువాత రెండో డోసు వేస్తారని పేర్కొన్నారు.
ఈరోజు వాక్సిన్ ప్రక్రియ సజావుగా సాగిందని తెలిపారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. వికారాబాద్ జిల్లాలో 3 సెంటర్లలో 90 మందికి వ్యాక్సిన్ వేసినట్లు స్పష్టం చేశారు. ఈనెల 18 నుంచి 28 సెంటర్లలో 5,395 మందికి మొదటి విడత వ్యాక్సిన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి వెంట కలెక్టర్ పౌసుమి బసు, పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, కాలే యాదయ్య, జిల్లా వైద్యాధికారి, జడ్పీ ఛైర్పర్సన్ సునీతరెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: టీకా తీసుకున్నామని అజాగ్రత్త వద్దు: మోదీ