కరోనా నివారణకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఇళ్ల నుంచి బయటికి రాకుండా లాక్డౌన్ను పూర్తిగా అమలు చేయడమే ప్రజలు ప్రభుత్వానికి చేసే సహకారం అని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికీ ఆరు కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు. విద్యాశాఖ మంత్రి తాండూరులో జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంట్రోల్ మెంట్ జోన్లుగా ప్రకటించినట్లు.. ఈ జోన్లలోని ప్రభుత్వ ఉద్యోగులు అక్కడి నుండే విధులు నిర్వహిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఇటువంటి సీ జోన్లలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. సర్వే బృందాలకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆమె కోరారు. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న కూలీలు భౌతిక దూరం పాటిస్తూ ఉపాధి కల్పించమంటూ తమకు అర్జీ పెట్టుకుంటే ఆ పనుల్ని అప్పగిస్తామని ఆమె తెలిపారు.
అలాగే ఇంకుడు గుంతలు తవ్వడానికి కొంత మంది కార్మికులు పనిచేస్తున్నారని.. తద్వారా వారికి ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సునీత రెడ్డి, కలెక్టర్ పౌసుమి బసు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య