జీహెచ్ఎంసీ ఫలితాలతో భాజపా నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. వికారాబాద్ జిల్లాలోని మోమిన్‌పేట, నారాయణపూర్, కెరెల్లిల్లో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు. కెరెల్లిలో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక అసలు ఎన్నికే కాదన్నారు. వాటి గురించి పెద్దగా పట్టించుకోవద్దన్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా భాజపా నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
హైద్రాబాద్‌లో వచ్చిన ఫలితాలే ప్రామాణికమైతే... 2015లో దిల్లీలో జరిగిన ఎన్నికల్లో 70 స్థానాలకు 3 సీట్లకే పరిమితమైన భాజపా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతు ఏడ్చిన రాజ్యంలో ఎవ్వరూ బాగుపడినట్లు చరిత్రలో లేదని హెచ్చరించారు. ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌లో తెరాస పాల్గొంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకండా జాతీయ రహదారులు నిర్భందిస్తామని మంత్రి తెలిపారు.