అపారమైన నమ్మకంతో తెరాసను గెలిపించిన కొడంగల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై ప్రగతిభవన్లో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కొడంగల్, కోస్గి పట్టణాల్లో చేపట్టాల్సిన పనులపై పురపాలక శాఖ అధికారులతో కేటీఆర్ చర్చించారు. మిషన్ భగీరథ, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖ, ఆర్ అండ్ బీ తదితర శాఖల వారీగా అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొడంగల్లో డిగ్రీ కళాశాల, కోస్గిలో బస్ డిపో పనుల పురోగతిపై మంత్రులు ఆరా తీశారు. ఎస్టీ హాస్టల్ భవనం, ఎస్సీ, బీసీ గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ భవిష్యత్ అవసరాల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళికను రూపొందించాలని సూచించారు.