పనుల కల్పనలో గతేడాది రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది అందరికీ పనులు కల్పించే దిశగా జిల్లా అధికారులు ముందుకు సాగుతున్నారు. జాబ్ కార్డులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో పనులు చేపట్టేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. చేపట్టిన పనుల వివరాలను అంతర్జాలంలో నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇప్పటి వరకు జిల్లాలో చేపట్టిన పనుల వివరాలు, చిత్రాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. చేసిన పనుల ఫొటోలను జియోట్యాగింగ్ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి జిల్లాలోని పలు పంచాయతీల్లో పూర్తయిన పనుల వివరాలు సేకరించి అంతర్జాలంలో నమోదు చేస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికగా చేపట్టిన పనులను మాత్రమే నిక్షిప్తం చేసి జియోట్యాగింగ్‌కు అనుసంధానం చేయనున్నారు.
ప్రణాళిక ప్రకారం..:
జిల్లాలో పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించనున్నారు. మండలాల వారీగా గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీ కార్యదర్శులు, క్షేత్రసహాయకులు, డీఆర్‌డీఓ అధికారులు పాల్గొంటారు. రైతులు, కూలీలతో చర్చించి మండలాల వారీగా గ్రామసభలు పూర్తి చేసి చేపట్టాల్సిన పనులపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించనున్నారు. జిల్లాలో భూగర్భజలాల పెంపునకు సమగ్ర వాటర్‌షెడ్ పనులు చేపడతారు. గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసి ఎస్సీ, ఎస్టీ, రైతుల బంజరు భూములను సాగుకు అనువుగా మార్చనున్నారు. అదే విధంగా ఉత్పాదక పెంపు కింద వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యానవన, మత్స్యశాఖ తదితర సంఘాలకు కొంత రుణాన్ని అందజేస్తారు. చేపల ఉత్పత్తికి కుంటల నిర్మాణం, కాలువల్లో పూడికతీత, మంచినీటి, రజక చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టనున్నారు. బంజరు భూముల్లో రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటడం వంటి పనులు చేపట్టేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు.
ప్రధానమైనవి..
* పంట కాల్వల నిర్మాణం
* ఫీడర్ కాల్వలు, పంటకాల్వల్లో పూడిక తీయడం
* పశువులకు నీటి తొట్టీలు, తాగునీటి పైపులైన్లు, నీటి ట్యాంకులు, ఆర్వోప్లాంట్ల ఏర్పాటు
* సహజ వనరుల కింద నీటి నిల్వ కందకాలు, మట్టికట్టలు ఏర్పాటు చేయడం
* విడిరాళ్లు కట్టుట, సేద్యపు, ఊట కుంటలు, చెక్‌డ్యాంలు, పశువుల పాకల నిర్మాణం
అడిగిన వారందరికీ పని..
అన్ని గ్రామాల్లో సభలు నిర్వహించి పనుల కార్యాచరణను రూపొందిస్తున్నాం. ఇప్పటి వరకు 334 పంచాయతీల్లో నిర్వహించి అవరసమైన పనుల జాబితాను రూపొందించాం. వలస కూలీలకు కొత్తగా ఎనిమిది వేల జాబ్‌కార్డులు జారీ చేశాం. అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తాం.