ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మావోయిస్టుల కట్టడికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కేంద్ర బలగాలతో కలిసి ‘ఆపరేషన్ ప్రహార్’ పేరుతో ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని గోదావరి పరీవాహక ప్రాంతంలోకి ఛత్తీస్‌గఢ్ వైపు నుంచి మావోయిస్టులు చొచ్చుకురాకుండా సరిహద్దుల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. మావోయిస్టు కార్యకలాపాలు నిరోధించడంలో అనుభవం ఉన్న సిబ్బందిని ఆయా ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లకు ఇప్పటికే బదిలీ చేశారు. పైస్థాయి అధికారులను కూడా మార్చబోతున్నారు.
145 మంది తెలంగాణ వారు
మావోయిస్టుల్లో రాష్ట్రానికి చెందిన 145 మంది ఉన్నారని నిఘా వర్గాల అంచనా. వీరిలో 15 మంది మాత్రమే తెలంగాణలో క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 80 మందితో కలిసి ఈ 15 మంది తెలంగాణలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. వీరంతా అదును దొరికినప్పుడు సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంటారని, ఇక్కడ పోలీసుల ఒత్తిడి పెరగ్గానే మళ్లీ ఛత్తీస్‌గఢ్ వెళుతుంటారని సమాచారం.
‘ఆపరేషన్ ప్రహార్’లో భాగంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన అబూజ్‌మడ్, నారాయణ్‌పూర్, సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లో బలగాలు నిరంతర గాలింపులు నిర్వహిస్తున్నాయి. చెట్ల ఆకులు రాలిపోయే కాలం కావడం వల్ల.. అడవిలో దాక్కోవడం మావోయిస్టులకూ కష్టమవుతుంది. ఈ పరిస్థితిలో ఛత్తీస్‌గఢ్‌లో తలదాచుకుంటున్న మావోయిస్టులు సరిహద్దులు దాటి తెలంగాణలోకి చొరబడవచ్చని అంచనా వేస్తున్నారు.
మణుగూరుకు మొదటిసారి ఐపీఎస్ అధికారి
ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకొని ఉన్న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని (ఎక్కువగా గోదావరి పరీవాహక ప్రాంతం) పోలీసుస్టేషన్లలో అధికారులను బదిలీ చేసి వారి స్థానంలో వామపక్ష తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో అనుభవం ఉన్న వారిని నియమించారు. మణుగూరు సబ్ డివిజన్‌కు మొదటిసారి ఐపీఎస్ అధికారిని బదిలీ చేశారు. అవసరాన్ని బట్టి సరిహద్దుల్లోని మిగతా సబ్ డివిజన్లలోనూ ఐపీఎస్‌లనే నియమించాలని భావిస్తున్నారు. మావోయిస్టులు ఒక్కసారి రాష్ట్రంలోకి జొరబడితే, వారి కార్యకలాపాలు నిరోధించడం కష్టమని, అసలు ఇటువైపు రాకుండా కట్టడికి ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతాన్ని భాగాలుగా విభజించి నిరంతరం గాలింపు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేశారు.
ఇవీ చూడండి: తెలంగాణ నేలపై డైనోసార్లు