నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా అధికార తెరాస పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనలు అతిక్రమించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమ ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా రేపు నాగార్జునసాగర్ హాలియాలో సీఎం కేసీఆర్ లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సాగర్ నుంచి స్థానికేతర నేతలు వెంటనే వెళ్లేలా చర్యలు తీసుకోవాని కోరారు. సీఎం కేసీఆర్ ఒత్తిడితో అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయడం లేదని వివరించారు. పోలీసు వాహనాల్లో మద్యం, డబ్బు తరలిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలపై నల్గొండ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో సాగర్ ఉపఎన్నిక నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తమ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్... వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ తెలిపారు.
ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన అంశాలు:
- కొవిడ్, ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అతిక్రమించి లక్షమందితో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభపై చర్యలు తీసుకోవాలి.
- స్థానికులు కాని ప్రజాప్రతినిధులను వెంటనే నియోజకవర్గం నుంచి పంపేయాలి.
- అనుమతి లేకుండా ప్రచారంలో ఉపయోగిస్తున్న వాహనాలను సీజ్ చేయాలి.
- నియోజకవర్గం సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కేంద్ర బలగాలతో తనిఖీలు నిర్వహించాలి.
- స్థానిక పోలీసుల వాహనాలను కూడా కేంద్ర బలగాలతో సోదాలు చేయించాలి.
- పోలింగ్ బూత్‌ల వద్ద కేంద్ర బలగాలనే ఉంచాలని... బూత్‌కి సమీపంలో ఓటువేసే వారిని తప్ప బయట వారిని అనుమతించకూడదు.
ఇదీ చూడండి: మాయ మాటలు చెప్పేవారిని మళ్లీ నమ్మొద్దు: జానారెడ్డి