Jagadish Reddy on Central Power prososals: మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని సూర్యాపేటలోని చారిత్రక పిల్లలమర్రి శివాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం.. ఆయన విద్యుత్ పంపిణీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మీడియా సమావేశంలో మండిపడ్డారు. కేంద్ర ఈఆర్సీ తీసుకున్న నిర్ణయం ఆదానీకి లాభం చేకూర్చేలా ఉందని మండిపడ్డారు.
విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు ప్రజల డబ్బులను దోచి పెట్టేందుకు కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్రం తెచ్చేవి సంస్కరణలు కాదని పేద ప్రజలని పీల్చి పిప్పి చేసే నల్ల విద్యుత్ చట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగ విషయంలో కేంద్రం తప్పుడు విధానాలను అవలంభిస్తోందని గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారని.. ఇప్పుడా వ్యాఖ్యలను నిజం చేసే విధంగా సీఈఆర్సీ నిర్ణయం వచ్చిందని ఆరోపించారు. ఈఆర్సీ నిర్ణయం ప్రకారం బహిరంగ విపణిలో యూనిట్ విద్యుత్‌ను 50 రూపాయల వరకు అమ్ముకోవచ్చు అంటే ప్రజలను చీకట్లోకి నెట్టి దోపిడీ చేయడమేనని దుయ్యబట్టారు.
దేశంలో అపారమైన బొగ్గు నిల్వలు ఉండగా కేంద్రం విదేశీ బొగ్గుని ఎందుకు తెస్తోందని మంత్రి ప్రశ్నించారు. విదేశీ బొగ్గుతోనే అసలు సమస్య ఉందని, అదానీ లాంటి కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. అదానీ కంపెనీలకు ఉన్న బొగ్గు నిల్వల నేపథ్యంలో రాబోయే రోజుల్లో కృత్రిమ విద్యుత్ సంక్షోభం సృష్టించి అదానీకి మేలు చేయాలని బీజేపీ సర్కార్ చూస్తోందని, దేశ భక్తి మాటున దేశ ద్రోహానికి ఆయన మండిపడ్డారు.
తాజా విద్యుత్ సంకరణలతో మోడీ, అదాని స్నేహ బంధం ప్రజలకు ఆర్ధమౌతుందని, దేశ ప్రజలు బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని జగదీష్ రెడ్డి కోరారు. రాష్ట్ర అప్పులపై నిర్మలా సీతారామన్ అబద్ధాలు మాట్లాడుతోందని... ఎవరో రాసిన స్క్రిప్ట్ నిర్మల చదివి ప్రజలకు అబద్ధాలు చెబుతూ అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే తెలంగాణ అప్పులు చేస్తోందని, చేసిన అప్పులు ప్రజల అభివృద్ధి కోసమే పెట్టుబడిగా పెట్టామని గుర్తు చేశారు. కేంద్రం మాత్రం చేసిన అప్పులతో ప్రైవేట్ వ్యక్తులకు ఆస్తులు కూడబెడుతోందని బీజేపీ ఎన్ని వేషాలు వేసినా ప్రజల ముందు దోషిగా నిలబడటం ఖాయమని జగదీష్ రెడ్డి అన్నారు.
విద్యుత్ విషయంలో కేంద్రం చేస్తున్నదంతా తప్పుడు విధానం. అంతిమంగా దీనివల్ల నష్టపోయేది ప్రజలే. కేంద్రం తెచ్చేవి సంస్కరణలు కావు.. ప్రజలను పీల్చి పిప్పి చేసే నల్లచట్టాలన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గారు గతంలోనే చెప్పారు. అవన్నీ నిజం అన్న విషయం ఇప్పుడు బయటపడింది. ప్రత్యేకించి విద్యుత్ విషయంలో కేంద్రం తీసుకునే చర్యల వల్ల సామాన్యులు మళ్లీ కరెంటుకు దూరమవుతారు. యూనిట్ ధర రూ.50 వరకు అమ్ముకోవచ్చు అని కేంద్రం తమ నిబంధనల్లో పేర్కొన్నదంటే.. రాబోయే రోజుల్లో పేదలు ఎలా బతుకుతారు- జగదీష్ రెడ్డి , రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
ఇవీ చదవండి: