సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో కార్తిక మాసం(karthika masam 2021) తొలి రోజున నల్లకట్ట సంతాన కామేశ్వరీ సమేత శంభు లింగేశ్వర స్వామి వారిని సూర్యకిరణాలు తాకాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఐదేళ్ల నుంచి కార్తిక మాసం సందర్భంగా శంభులింగేశ్వర స్వామిని సూర్యకిరణాలు తాకుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ మాసంలో భక్తులు వేకువజాము నుంచే స్వామివారి దర్శనానికి తరలివస్తారు.
కార్తికమాసంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే సంతానంలేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. స్వామివారికి రుద్రాభిషేకాలు చేయిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. సంతానం లేనివారు స్వామివారికి తడిబట్టలతో పూజ చేస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ నెల రోజులపాటు స్వామివారి ఆలయం ఓం నమశ్శివాయ నామస్మరణతో మారుమోగుతుంది.
మేము బూరుగడ్డ శివాలయం చూడడానికి వచ్చాం. శివాలయంలో సూర్యాకిరణాలు దేవునిపై పడడం చూసి చాలా పునీతులమయ్యాము. దైవ దర్శనం మాకు బాగా జరిగింది. ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాం.
-భక్తులు
ఆలయానికి వేకువజామునుంచే భక్తులు తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేసి... దీపాలు వెలిగించారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా శివనామస్మరణతో మారుమోగింది.
ఇదీ చదవండి: Karthika masam 2021: కార్తీక మాసం విశిష్టత ఏమిటి? ఏం చేయాలి?