రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా భావించే గొల్లగట్టు వేడుక... మొదలవుతోంది. లింగమంతుల పెద్దగట్టు, గొల్లగట్టుగా పిలిచే జాతర... మాఘ పౌర్ణమి నాడు ఆదివారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమవుతోంది. ఎక్కడైనా ఒక వేడుకకు ఒక వంశస్థులే హక్కుదారులుగా ఉంటారు కానీ... లింగమంతుల జాతరకు మూడు వంశాలైన గొర్ల, మున్నా, మెంతెబోయినవారు హక్కుదారులుగా వ్యవహరిస్తుంటారు. దురాజ్‌పల్లి ప్రాంతానికి శివుడు రావడంతోనే పెద్దగట్టు జాతర ప్రారంభమైందని ప్రశస్తి.
అక్కడిలాగే
సమ్మక్క-సారలమ్మ తరహాలోనే... పెద్దగట్టులో రెండేళ్లకోసారి ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ దేవతలు వనాల నుంచి జనాల్లోకి వచ్చే ప్రక్రియలాగే... దురాజ్‌పల్లి గుట్టకి సైతం 36 విగ్రహాలున్న దేవరపెట్టెను పల్లకీలో తీసుకువస్తారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకు అయిదు రోజులపాటు జాతర కొనసాగనుండగా... భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. నలుదిక్కుల నుంచి వేంచేసే భక్తజన ప్రవాహంతో... హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఒకవైపు మూసివేయనున్నారు.
ఇక్కడ నైవేద్యం ప్రత్యేకం
సాధారణంగా శివాలయాలున్న చోట... అభిషేకాలు, తీపి పదార్థాలతో నైవేద్యం పెట్టడం ఆనవాయితీ. కానీ పెద్దగట్టులో కొలువైన శివుడి ముందే... పొట్టేళ్లను బలి ఇస్తారు. త్రినేత్రధారికి కుమార్తెగా, సోదరిగా భావించే చౌడమ్మతల్లి పేరిట... ఆయన ఆలయానికి ఇంచుమించు ఎదురుగానే మాంసాహారం నైవేద్యంగా సమర్పిస్తారు. అలా విభిన్న సంస్కృతికి వేదికగా నిలుస్తోంది... పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర. దురాజ్‌పల్లి గుట్ట... సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలో ఉంది.
జ్యోతులు వెలిగించడంతో..
మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెం నుంచి వచ్చే దేవరపెట్టె... సూర్యాపేట సమీపంలోని కేసారం చేరుతుంది. పసుపు, కుంకుమ, పాలు, నెయ్యి, పిల్లతల్లి పొట్టేలును వెంటబెట్టుకుని... పెట్టెను కాలి నడకన మోసుకుంటూ గుట్టకు చేరతారు. ఆదివారం రాత్రి కేసారం నుంచి బయల్దేరే దేవరపెట్టె... సోమవారం తెల్లవారుజామున పెద్దగట్టు చేరుకుంటుంది. గొర్ల, మెంతెబోయిన వంశాల బోనాలను సోమవారం వేకువజామున స్వామి, అమ్మవార్లకు సమర్పిస్తారు. కొత్త కుండల్లో తెచ్చిన బియ్యాన్ని వండి నైవేద్యం పెడతారు. వండిన అన్నంను రాశులుగా పోసి... దానిపై జ్యోతులు వెలిగించడంతో సంరంభం ప్రారంభమవుతుంది.
లోపించిన ప్రణాళిక
ఈసారి జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. అయితే వీటిని ఖర్చు చేసే విషయంలో ప్రణాళిక లోపిస్తోంది. తాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల గదులు, రహదారులు, విశ్రాంతి గదుల నిర్మాణాలు... శాశ్వత ప్రాతిపదికన జరగడం లేదు. సూర్యాపేటకు 8 కిలోమీటర్ల దూరంలోని జాతర ప్రదేశానికి... ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఈ వేడుకలకు 14 వందల మందితో... భద్రత కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి : ప్రత్యర్థులు కూడా అభినందించాల్సిందే: కేటీఆర్