తెరాస నాయకులు సాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ మీదనే ఎక్కువ ఆసక్తి చూపుతారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కేవలం ఓట్ల సమయంలోనే దర్శనమిస్తారని ఎద్దేవా చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని ఇందిరాభవన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాలకు కేరాఫ్‌గా తెరాస నాయకులు నిలిచారని ఆరోపించారు.
మంథనిలో న్యాయవాద దంపతులను అతి కిరాతకంగా నరికి చంపడం తెరాస పాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం మొదలైందని పేర్కొన్నారు. తెరాస ఎమ్మెల్సీ ఏనాడు శాసనమండలిలో నోరు మెదపలేదని విమర్శించారు. రాములు నాయక్ అధికార పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారని.. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉత్తమ్ కోరారు. గిరిజనులకు సీఎం తీవ్ర అన్యాయం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.