Mallikamba Sports Woman in Thungathurthy : ఇంటి నిండా పేదరికం.. తప్పని పరిస్థితిలో చిన్న వయసులోనే వివాహం.. అయితేనేం సాధించాలనే సంకల్పం,ఆత్మవిశ్వాసంతో ఏవి అడ్డు కావంటూ ముందుకు సాగింది మల్లికాంబ. అందుకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభించింది. ఫలితంగా అటు చదువుల్లో రాణించి.. ఇటు క్రీడల్లో సత్తాచాటింది. అంతేకాక తన లాంటి పరిస్థితి క్రీడాకారులకు.. రాకూడదని ప్రత్యేక శిక్షణలు ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది.
Ramoji Rao: అమ్మా.. నీ స్ఫూర్తికి సలాం!.. పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణికి రామోజీరావు సాయం
Mallikamba Sports Teacher in Thungathurthy : ఈ యువతి పేరు కొల్లూరి మల్లికాంబ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి స్వస్థలం. చిన్నతనంలో ఊళ్లో జరిగిన క్రీడపోటీల్లో తన తండ్రి ఓడిపోయాడు. ఎలాగైనా సరే క్రీడల్లో రాణించి తండ్రి పేరు నిలబెట్టాలని అప్పుడే బలంగా నిర్ణయించుకుంది. ఆ పట్టుదలతో కబడ్డీపై ఇష్టం పెంచుకుని పాఠశాల, కళాశాల స్థాయిలోనే పతకాలు సాధించేది ఈ యువతి. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా ఇంటర్‌లోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.
తర్వాత పిల్లలు పుట్టినా లక్ష్యం మాత్రం వదలలేదు. భర్త ప్రోత్సాహంతో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాణించింది. మరో వైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే బీఎస్సీ, బీపెడ్, ఎంపెడ్ , యోగా శిక్షణ పూర్తి చేసింది. ఈ ఏడాది మార్చిలో పీహెచ్‌డీ పట్టా కూడా సాధించింది. పిల్లల పోషణ కోసం క్రీడా శిక్షణ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తూ ఎందరో క్రీడాకారులను తయారు చేస్తోంది.
Suryapet District News : కబడ్డీ, సాఫ్ట్‌బాల్ క్రీడల్లో.. విద్యార్థినులకు తర్ఫీదు ఇచ్చి 20 మందిని జాతీయ స్థాయికి, 100 మందికి పైగా రాష్ట్రస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దింది. క్రీడల రిఫరీగా ప్రతిభ కనబర్చి.. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. క్రీడాకారిణిగా ఎదగాలనే తపనతో ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలను అధిగమించి ముందుకు సాగింది మల్లికాంబ. తాను పడిన కష్టాలు, ఇబ్బందులు ఇకముందు క్రీడాకారులుగా ఎదిగే విద్యార్థులకు కలగకుండా చూడాలనే లక్ష్యంతో క్రీడా విద్యనందిస్తున్నట్లు చెబుతోంది.
చిన్ననాటి నుంచే కూమార్తె ఆటల్లో బాగా రాణించేదని.. క్రీడలపై ఉన్న మక్కువతోనే ఈ స్థాయి వరకు వచ్చిందని.. తమకూ పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిందని మల్లికాంబ తండ్రి చెబుతున్నాడు. మల్లికాంబకు క్రీడలు, చదువు చాలా ఇష్టం.. ఒకదాని కోసం మరొకదాన్ని వదులుకోవడం ఇష్టంలేక చాలా కష్టపడిందని.. తన ఆసక్తి గమనించి అండగా నిలిచినట్లు ఆమె భర్త చెబుతున్నాడు.
పేదరికం, బాల్యవివాహంతో మెుదట్లో కొంచెం సందిగ్ధతకు లోనైంది మల్లికాంబ. కానీ అక్కడితో ఆగిపోలేదు. ఫలితంగానే చదువుల్లో, ఆటల్లో సక్సెస్‌గా నిలిచి అందరి మన్ననలు అందుకుంటోంది. తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న మల్లికాంబ కథ ఇది.
"నాకు చిన్నతనం నుంచే ఆటలంటే అమితమైన ఆసక్తి. చిన్నతనంలో ఊళ్లో జరిగిన క్రీడపోటీల్లో మా తండ్రి ఓడిపోయాడు. ఎలాగైనా సరే క్రీడల్లో రాణించి.. తండ్రి పేరు నిలబెట్టాలనుకున్నాను. పెళ్లయ్యాక మావారు కూడా ప్రోత్సహించారు. ఇప్పుడు నేను కబడ్డీ, సాఫ్ట్‌బాల్ క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను". - మల్లికాంబ, స్పోర్ట్స్ టీచర్