మహనీయుల ఆదర్శాలను భవిష్యత్తు తరాలకు అందించి వాటిని ఆచరింపచేసిన నాడే వారికి నిజమైన శ్రద్ధాంజలి ఘటించిన వారమవుతామని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో నెలకొల్పిన మహాత్మ జ్యోతీరావుపూలే దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలోని సామాజికమైన ఎన్నో రుగ్మతలను ఎదుర్కొని.. సమ సమాజ నిర్మాణం కోసం పోరాటం చేసిన మహనీయుడు పూలే అని దత్తాత్రేయ కొనియాడారు. చదువు లేకుండా ఎవరైనా ఏ రంగంలోనూ రాణించలేరని గ్రహించిన మహా జ్ఞాని అని తెలిపారు. నాణ్యమైన విద్య.. యువతకు ఉపాధినివ్వడమే గాక దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతుందన్నారు.
గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలతో బహిరంగ సభలో మాట్లాడే అవకాశం విగ్రహావిష్కరణతో లభించిందని దత్తాత్రేయ అన్నారు. ప్రజల్లో నైపుణ్యతను పెంచడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అందులో యాభై శాతం మహిళలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే తన వంతు సహకారం తప్పక అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: హరితహారం మొక్కలు కోసినందుకు ఈ.3 వేల జరిమానా