దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న వేళ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. కొవిడ్-19 కొంత మేరకు తగ్గేంతవరకు శుభకార్యాలు, అన్ని రకాల కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రేపటి నుంచి శుభకార్యాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు కూడా ఎక్కడైనా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉన్నట్లయితే ఎక్కడి వారు అక్కడే నిర్వహించుకోవాలని అన్నారు.
శుభకార్యాలు జరుపుకునే వారు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి దగ్గర బంధువులతో, స్నేహితులతో మాత్రమే జరుపుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు తక్కువ మందితో శుభకార్యాలు నిర్వహించుకునేలా ప్రయత్నం చేయాలని అన్నారు. అత్యవసరమైతే తప్ప ఇకపై ఏ కార్యక్రమానికీ హాజరుకానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు అన్యథా భావించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి చిన్న విషయానికి ఇంటి దాకా రాకుండా, ఏదైనా పని ఉంటే ఫోన్ ద్వారా, వాట్సాప్లో సందేశాలు పంపి మాట్లాడాలని అన్నారు. ప్రతి ఒక్కరు కరోనా నియంత్రణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి కోరారు.
ఇవీ చూడండి: చీపురు పట్టిన మంత్రి సత్యవతి.. ఏం చేశారంటే..!