భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురై కలుపు మందుతాగి ఓ భర్త ఆత్మహత్యకు యత్నించాడు. సూర్యాపేట జిల్లా మోత్కూరు మండలంలోని పాలడుగుకు చెందిన కొంపెల్లి నర్సింహ(40), నార్కట్పల్లి మండలం తొండల్వాయికి చెందిన కవితతో పదేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. నర్సింహ కొంత కాలంగా భార్యతో కలసి తొండల్వాయి గ్రామంలో ఉంటూ నార్కట్పల్లిలో భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
విసుగు చెందిన కవిత... నర్సింహను తిట్టి తనతో కాపురం చేయనని తేల్చిచెప్పేసింది. మనస్తాపానికి గురైన నర్సింహ తొండల్వాయి నుంచి అక్కెనపల్లి వరకు నడుచుకుంటూ వచ్చాడు. మోత్కూరుకు చేరుకుని కలుపు మందు కొని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. తానే 100కు డయల్ చేసి మందు తాగానని సమాచారం అందించాడు. రోడ్డుపై పడి ఉన్న నర్సింహను స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన వైద్యం కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.