హుజూరాబాద్‌తో పాటు మరో 4 మండలాల్లో దళితబంధు అమలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళితబంధు అమలు చేయాలని అధికారులకు సూచించింది. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో దళిత శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలను ఎంపిక చేసి... ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు హుజూరాబాద్‌తో పాటే దళితబంధు అమలు చేయనున్నారు.
ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు అమలు అవుతుండగా... ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలంలో, నాగర్‌కర్నూల్ జిల్లాలోని చారగొండ మండలంలో, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో అమలు చేయాలని సూచించింది. 4 మండలాల్లోని అన్ని ఎస్సీ కుటుంబాలకు దళితబంధు నిధులు వెంటనే ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్‌లో ఈ విషయంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తారు.
దళితబంధు పథకాన్ని ఉద్యమంలా చేపట్టిన ప్రభుత్వం... దళితబంధు పథకం అమల్లో లోటుపాట్లు, దళిత ప్రజల మనోభావాలు, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సీఎం నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ నాలుగు మండలాల్లోనూ దళితబంధును అన్ని కుటుంబాలకు అమలు చేయనున్నారు.
ఇదీ చూడండి: Dalit bandhu: దళిత బంధు నగదుతో ఏమి చేయవచ్చో తెలుసా..