రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌ను అధిక ధరలకు విక్రయిస్తూ సూర్యాపేట జిల్లాలో ఓ ముఠా చీకటి వ్యాపారానికి తెరతీసింది. కొవిడ్ బాధితుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని.. అందినకాడికి దండుకుంటోంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఇలాంటి వ్యాపారాలకు పాల్పడుతోన్న పలు ముఠాల్ని ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులపై మంగళవారం దాడులు నిర్వహించారు. రెమ్‌డెసివిర్‌ను అధిక ధరలకు అమ్ముతున్న 11 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి 30 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇంజక్షన్లను ఏపీలోని కర్నూల్ నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి సూర్యాపేట జిల్లాకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రైవేటు ఔషధ దుకాణంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో నిబంధనల ప్రకారం రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం వాటిని రోజుకు వందలోపే సరఫరా చేస్తుండటంతో.. బాధితులు ఇంజక్షన్ల కోసం పోటీపడుతున్నారు. ఇదే అదనుగా అక్రమార్కులు ముఠాగా ఏర్పడి.. అక్రమ వ్యాపారానికి తెరతీశారు. ఆసుపత్రుల మేనేజర్లతో సంబంధాలు ఏర్పరచుకుని దందా సాగిస్తున్నారు. 3,500 విలువ గల ఇంజక్షన్‌ను దాదాపు పదింతల అధిక ధరలకు అమ్ముతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు ఇలాంటి ముఠాల ఆటకట్టిస్తున్నా.. కొత్త ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి దందా సాగిస్తూనే ఉన్నాయి.
ఇదీ చూడండి: రహదారులపైకి వాహనదారులు.. సీజ్ చేస్తున్న పోలీసులు