Mahavir chakra to colonel santosh babu: చైనా సరిహద్దులోని గల్వాన్‌లో ప్రత్యర్థులతో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన కర్నల్ సంతోశ్ బాబుని... కేంద్రం మహావీర చక్ర పురస్కారంతో సత్కరించింది. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. సంతోష్ బాబు సతీమణి సంతోషి, తల్లి మంజులకి పురస్కారం ప్రదానం చేశారు. దేశానికి సంతోశ్ బాబు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
సంతోశ్‌బాబు సేవలను స్మరిస్తూ మరణానంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. యుద్ధ సమయాల్లో చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా ఈ అవార్డులు ఇస్తారు. మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో ‘మహా వీర చక్ర’ రెండో అత్యున్నత పురస్కారం.
సూర్యాపేటకు చెందిన సంతోశ్ బాబు.. 16 బిహార్ రెజిమెంట్‌కు కమాండింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సమయంలో గాల్వన్ లోయ వద్ద చైనా సైన్యం దురాక్రమణకు యత్నించగా.. భారత జవాన్లు దీటుగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. జూన్ 15న జరిగిన ఈ ఘటనలో సంతోశ్‌బాబుతో పాటు 21 మంది సైనికులు వీరమరణం పొందారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ పుణెలో డిగ్రీ పూర్తి చేసిన సంతోశ్‌బాబు.. 2004 డిసెంబర్‌లో జమ్మూలో తొలిసారి మిలటరీ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 డిసెంబర్‌లో కర్నల్‌గా పదోన్నతి వచ్చింది. బిహార్ 16వ బెటాలియన్ కమాండింగ్ అధికారిగా ఉన్న ఆయన.. తాను నేతృత్వం వహిస్తున్న బలగాలతో గాల్వన్ లోయల్లో విధులకు వెళ్లారు.
కర్నల్ సంతోశ్‌బాబు తన సర్వీసులో.. ఎక్కువ కాలం సరిహద్దులోనే పని చేశారు. 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించారు. కొంతకాలం కాంగో దేశంలో కూడా విధులు నిర్వహించారు. సంతోశ్‌బాబు భార్య సంతోషికి రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 ఉద్యోగ నియామక పత్రంతో పాటు రూ.4 కోట్ల చెక్కును అందజేసింది. కర్నల్ తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కు ఇచ్చింది. సంతోషి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్నారు.
ఇవీ చదవండి :