తమ గ్రామంలోని రహదారి సమస్యకు వెంటనే శాశ్వత పరిష్కారం చేపట్టాలని సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామస్థులు ధర్నా చేపట్టారు. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ బురదమయం అవుతున్నాయని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.
మెయిన్ రోడ్డు మీద చేపట్టిన ఆందోళన కారణంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవటం వల్ల ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా... ఆందోళన విరమించారు. పరిష్కారం చూపకపోతే... ఈసారి భారీ ఎత్తున ధర్నా చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.