సూర్యాపేట జిల్లా చింతలపాలెంలోని అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీ ముందు రైతులు ధర్నా చేపట్టారు. ఓ రైతు పొలంలో అక్రమంగా రాళ్ళు డంప్ చేస్తున్నారని అడిగితే... దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు తన పేర ఇచ్చిన భూమి పట్టా ఉందని యజమాని చెబుతున్నాడు. మైన్స్ బ్లాస్టింగ్కి కెమికల్స్ వాడటం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్ల రాకపోకల వల్ల దుమ్ము, ధూళి పంటలపై పడి పూర్తిగా నాశనమవుతున్నాయని ఆందోళన చేందుతున్నారు.
సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు... ఫ్యాక్టరీ యాజమాన్యం ఉచిత వైద్య, విద్య అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మిరప తోటలు పూర్తిగా పాడైపోతున్నాయని... ఎకరానికి లక్ష రూపాయల నష్టం వస్తోందని భాజపా జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి అన్నారు. పరిహారం చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. స్థానికుల ఆరోగ్యం పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఉద్యోగవకాశాలు కల్పించడం లేదని ఆరోపించారు.
ఆరు గంటల నుంచి ధర్నా చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్ల రైతులు గేట్లు తోసుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడం వల్ల మనస్థాపంతో రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. యాజమాన్యంపై దాడి చేసిన రైతులు ద్విచక్రవాహనంపై పారిపోయారు.
ఇదీ చూడండి: నన్ను ఎవరూ సంప్రదించలేదు.. అవన్నీ అవాస్తవం: జానా