జీవితంలో స్థిరపడేందుకు ఎవరైనా రెండుచేతులా శ్రమించక తప్పదు. అలాంటిది ఆ చేతులే లేకపోతే... అసలు ఊహించుకుంటేనే భయంగా ఉంది కదూ... ఒకదాని వెనుక ఒకటి కట్టగట్టుకొచ్చిన కష్టాలను తట్టుకుని కాళ్లనే చేతులుగా మార్చుకుని ఎందరో దివ్యాంగులకు ఆదర్శంగా నిలుస్తోంది సూర్యాపేట జిల్లా హూజూర్‌నగర్ మండలం సింగారంకు చెందిన చెడపొంగు వెంకటరమణ.
కాళ్లతోనే నెట్టుకొచ్చింది
పుట్టుకతోనే రెండు చేతులూ లేకుండా జన్మించిన వెంకట రమణ ఏనాడూ బాధపడలేదు. పదో ఏటనే తల్లిని కోల్పోయి తనకంటే చిన్నవాళ్లైన చెల్లి తమ్ముడికి తోడుగా నిలిచింది. తనకొచ్చే పింఛన్ డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఎలాంటి సమయంలోనూ మనోధైర్యం కోల్పోలేదు. ఇతరులకు తాను ఏమాత్రం తీసిపోనని ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తుంది. ప్రభుత్వం ఏదైనా సాయం అందిస్తే తన కాళ్లపై తాను నిలబడేందుకు కృషి చేస్తానంటోది వెంకటరమణ.
కాళ్లతోనే నుదిటిరాతను మార్చుకుంది
సూదిలో దారం ఎక్కించడం, ఇల్లు ఊడ్చడం, భోజనం చేయడం, సంతకం వంటివి కాళ్లతోనే చేస్తోంది. ఇతరులకు భారం కాకుండా తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటున్న ఈమె ఆలోచన ఎంతో మంచిదంటున్నారు స్థానికులు. ఆమెకు సర్కారు ఏదైనా సాయం చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా సమాజానికి భారంగా మారిన వారిని చూస్తుంటాం... అలాంటిది ఎన్నో బాధలను మనోధైర్యంతో ఎదుర్కొని... కాళ్లతోనే తన నుదిటి రాతను మార్చుకుని సమాజంలో నిలబడేందుకు సాయం కోరుతోంది వెంకటరమణ.