యువత జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ క్రీడల ముగింపు సభలో పాల్గొన్న ఆయన గెలుపొందిన జట్టుకు కప్పును అందజేశారు.
అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిన తెరాస ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. యువత క్రీడల్లో నైపుణ్యం పొందడానికి శిక్షణ కేంద్రాలతో పాటుగా... వారు నైపుణ్యం ప్రదర్శించడానికి క్రీడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 15ఎకరాల క్రీడా మైదానం ఏర్పాటు కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా... నిధులు కేటాయించారని వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గం క్రీడల పరంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీల్లో మొత్తం తొమ్మిది జిల్లాల జట్లు పాల్గొన్నాయి. హోరాహోరిగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వనపర్తి జట్టుపై రంగారెడ్డి జిల్లా జట్టు 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో వనపర్తి జిల్లా జట్టు, మూడవ స్థానంలో మహబూబ్ నగర్ నిలిచింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఛైర్మన్ రాజమౌళి, వైస్ ఛైర్మన్ దాసరి అమరావతి, కౌన్సిలర్లు, తెరాస పార్టీ నాయకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'తెరాస' ఓపిక నశిస్తే.. 'భాజపా' బయట తిరగలేదు: కేటీఆర్