కార్మికులను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేసిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మే డే సందర్భంగా సిద్దిపేటలోని కొండమల్లయ్య గార్డెన్స్‌లో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు నిత్యావసర సరుకుల కిట్స్, మాస్కులు పంపిణీ చేశారు.
కార్మికులు లేకపోతే అభివృద్ధి లేదని.. కార్మికుల భద్రత.. మా బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. కరోనా వంటి కష్ట కాలంలో ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ కార్మిక దినోత్సవాన్ని అంకితం చేస్తున్నామన్నారు. కార్మికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్న మంత్రి.. కరోనా నేపథ్యంలో ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడికి రూ.5 వేల అదనపు వేతనం అందిస్తున్నామని తెలిపారు.
కరోనా కాలంలో వలస కార్మికులను చూస్తే బాధ కలుగుతోందని మంత్రి పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు వారిని ఆదుకుంటున్నామని తెలిపారు. వారికి భోజనాలు పెట్టి కడుపు నింపటమే కాక 12 కిలోల బియ్యం, రూ.500 నగదు అందజేశామని తెలిపారు.
ఇదీ చూడండి: ఇద్దరి నుంచి 22 మందికి కరోనా.. అన్నీ జీహెచ్ఎంసీలోనే