కొత్త జిల్లాలో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, పోలీసు కమిషనరేట్లు, కలెక్టరేట్ల ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సిద్దిపేట నుంచి మొదలుపెట్టారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సిద్దిపేటకు చేరుకున్న సీఎం.. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. లోపలకు వెళ్లి కార్యాలయాన్ని పరిశీలించారు. ఎకరం విస్తీర్ణంలో రూ.4 కోట్లతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. ఆధునిక సదుపాయాలతో పాటు జీ ప్లస్ వన్‌గా ఈ భవనాన్ని రూపొందించారు. గ్రౌండ్ ఫ్లోర్లో కార్యాలయం.. మొదటి అంతస్తులో నివాస సముదాయం ఉండేలా తీర్చిదిద్దారు. సీఎం పర్యటన నేపథ్యంలో.. కార్యాలయాన్ని పూలు, రంగురంగుల విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
అనంతరం.... సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ సముదాయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కమిషనరేట్ లోపలకు వెళ్లి పరిశీలించిన సీఎం... సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్‌ను సీట్లో కూర్చోబెట్టారు. కొండపాక మండలం రాంపల్లి శివారులో పోలీస్ కమిషనరేట్ నిర్మాణం చేశారు. మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.
కొండపాక మండలం దుద్దెడ వద్ద నిర్మించిన కలెక్టరేట్ సమీకృత భవన సముదాయాలను సీఎం ప్రారంభించారు. 50 ఎకరాల్లో అధునాతన హంగులతో వీటిని నిర్మించారు. అధికారులతో కలెక్టరేట్లో భేటీ అయిన తర్వాత.. కామారెడ్డి జిల్లాకు పయనమవనున్నారు.
ఆకస్మిక తనిఖీలు..
ముఖ్యమంత్రి(CM KCR) పర్యటన దృష్ట్యా సిద్దిపేట జిల్లా కేంద్రంలో పోలీసులు గట్టి బందోబస్త్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం తర్వాత.. సీఎం.. జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోనున్నారు.
మధ్యాహ్నం కామారెడ్డి జిల్లాకు..
సిద్దిపేట పర్యటన అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కామారెడ్డిలో మొదట కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత.. సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో మాట్లాడనున్నారు.
ముందస్తు అరెస్టులు
సీఎం(CM KCR) పర్యటన దృష్ట్యా జిల్లావ్యాప్తంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. కాంగ్రెస్, భాజపా, విద్యార్థి సంఘాల నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. కేసీఆర్ పర్యటనను అడ్డకుంటారనే సమాచారంతో చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.