గురువారం జరగనున్న లోక్సభ ఎన్నికలకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు కలెక్టర్ కృష్ణ భాస్కర్. జిల్లాలో మొత్తం 9 లక్షల మంది ఓటర్లు ఉన్నారని.. మొదటి సారి ఓటు వేసే వారు 22 వేల మంది ఉన్నారని పేర్కొన్నారు. దివ్యాంగులు 15, 626 మంది ఉన్నారని తెలిపారు. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని.. 9 లక్షల మందికి ఓటరు స్లిప్పులు ఇచ్చామని తెలిపారు.
జిల్లాలో మొత్తం 1136 పోలింగ్ కేంద్రాలు, 900లు రూట్ మ్యాప్ ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. కొన్ని 2009లో వాడిన ఈవీఎంలను వాడుకోవడం జరుగుతుందని.. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే ఓటర్లు సహకరించాలని కోరారు. దివ్యాంగులు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లేందుకు 700 ఆటోలు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియెగించుకోవాలని కలెక్టర్ కోరారు.
జిల్లా వ్యాప్తంగా ఆధారాలు లేని 46 లక్షలు డబ్బులు సీజ్ చేశామని.. 1700 లీటర్ల లిక్కర్ పట్టుకున్నామని వెల్లడించారు. మొత్తం 10,000 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారన్నారు.
సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న మూడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామని పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 6000 మందిని బైండోవర్ చేశారు. తెలంగాణ పోలీసులతో పాటు కర్ణాటక, గోవా రాష్ట్రాలకు చెందిన భద్రతా సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నారు. ఎన్సీసీ క్యాడెట్లు 300 మంది కూడా ఎన్నికల విధుల్లో ఉంటారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞాలు ఉంటాయని సీపీ తెలిపారు. హద్దు దాటితే కఠిన చర్యలు ఉంటాయని జోయల్ డేవిస్ హెచ్చరించారు.
ఓటర్లకు ఏదైనా సమస్య వస్తే 9223166166 నెంబర్కు మెసేజ్ చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి : ఐదేళ్ల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది