ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో.. పంట దిగుబడి రెట్టింపై, కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇచ్చిందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకులకు లోనైనా.. రాష్ట్ర ఎకానమి మాత్రం దెబ్బ తినలేదని వివరించారు. జిల్లాలో ఈనెల 15 నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో.. ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..
వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఈ ఏడాది.. 17 శాతం వృద్ధి నమోదైందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం.. రైతులకు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే అది సాధ్యమైందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క సిద్దిపేట జిల్లాలోనే.. యాసంగిలో రూ.1,600 కోట్ల విలువైన ధాన్యం పండిందని వివరించారు. వర్షాకాలం కంటే.. యాసంగిలోనే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగా.. జిల్లా వ్యాప్తంగా 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
కేంద్రాల్లో.. అన్ని సౌకర్యాలను కల్పించండి
దిగుబడులకు తగ్గట్లుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాట్లు చేయాలని మంత్రి.. అధికారులను ఆదేశించారు. అవసరమైతే.. కరోనా దృష్ట్యా మూసివేసిన పాఠశాలల మైదానంలోనూ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రైతులు.. విధిగా టోకెన్ పద్ధతిని పాటించాలని కోరారు.
దళారుల నుంచి ధాన్యాన్ని కొనవద్దు
ధాన్యాన్ని 17 శాతం కంటే తేమ మించకుండా కేంద్రాలకు తెచ్చే బాధ్యత రైతులదేనని అన్నారు మంత్రి. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే 'లే ట్రక్ సీట్'లో అన్నదాతల వివరాలను నమోదు చేసి వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. తద్వారా వారికి చెల్లింపులు త్వరగా చేసే వీలు కలుగుతుందని వివరించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి దళారులు తెచ్చిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దని మంత్రి.. అధికారులకు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఈసారి నిరాడంబరంగా ఉగాది వేడుకలు: రాష్ట్ర ప్రభుత్వం