సిద్దిపేట ఇండస్ట్రీయల్ పార్కు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చిరునామాగా మారిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు((HARISH RAO) అన్నారు. జిల్లా కేంద్రంలోని మిట్టపల్లి ఇండస్ట్రీయల్ పార్కులోని ఐదెకరాల్లో ప్లగ్ అండ్ ప్లే మోడల్ భవనానికి ఆదివారం ఉదయం భూమిపూజ చేశారు. రూ.10 కోట్లతో దీనిని నిర్మించనున్నట్లు తెలిపారు. 8 నెలల్లో దీనిని పూర్తి చేసి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లోని 16 మందిని బిజినెస్ వ్యవస్థాపకులుగా మార్చనున్నట్లు తెలిపారు.
యువతకు మంచి అవకాశం
16 మంది యువ పారిశ్రామికవేత్తలకు చిన్న, మధ్య తరహా యూనిట్లు పెట్టుకునే అవకాశం లభించిందని... సొంత డబ్బులతో భవనాన్ని నిర్మించుకొని పరిశ్రమ పెట్టలేనివారికి ఇది మంచి అవకాశమని అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరఫున వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించి... పరిశ్రమల యూనిట్ల స్థాపనకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ పార్కు కోసం రూ.10 కోట్లు మంజూరు చేసిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు(KTR) కృతజ్ఞతలు తెలియజేశారు.
నూతన వ్యవస్థాపకులను ప్రోత్సహించడం ద్వారా కొత్త పరిశ్రమలు నెలకొల్పడం సాధ్యమవుతుంది. రూ.10 కోట్లతో ఇండస్ట్రియల్ పార్కులో ఓ భవనాన్ని నిర్మించడానికి భూమి పూజ చేశాం. 16 మంది ఔత్సాహికులకు అవకాశం కల్పించనున్నాం. సొంతంగా డబ్బు ఖర్చు చేసి.. భవనాన్ని నిర్మించి పరిశ్రమ ప్రారంభించలేని వారికోసం దీనిని ఏర్పాటు చేశాం. భవనాన్ని నిర్మించి మౌలిక వసతులను కల్పించి యువ పారిశ్రామికవేత్తలకు అద్దెకు ఇస్తాం. ఇది మంచి అవకాశం. యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలి.
-మంత్రి హరీశ్ రావు
పిల్లల కోసం ప్రోటీన్ ఫుడ్
సిద్దిపేట నియోజకవర్గంలో మూడు నుంచి ఆరేళ్ల వయసున్న ప్రతి చిన్నారికి పోషకాహారం అందించాలని ఆర్థికమంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట పట్టణం ఇందిరా నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచిత ప్రోటీన్ ఫుడ్ అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 200 మంది చిన్నారులకు ప్రోటీన్ ఫుడ్ పంపిణీ చేశారు. కొవిడ్ మూడోదశ నేపథ్యంలో.... వైరస్ నుంచి శరీరం తట్టుకునేలా మంచి ఆహారం అందించాలని ఆయన సూచించారు. చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం అందించి... వారిలో రోగ నిరోధక శక్తిని పెంపొందించాలన్న మంచి ఉద్దేశంతో ట్రస్ట్ ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. జిల్లాలో మూడు నుంచి ఆరు ఏళ్ల వయసున్న పేద పిల్లలు 5 వేల మంది ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.
చిన్న పిల్లలకు కరోనా వస్తదని అందరూ భయపెడుతున్నారు. అది వస్తదా.. రాదా అనేది పక్కన పెట్టాలి. అది వచ్చినా తట్టుకునేలా పిల్లలకు పౌష్టికాహారం అందించాలి. ప్రోటీన్ ఫుడ్‌తో చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారు. సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సాయంతో మూడు నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలకు ప్రోటీన్ ఫుడ్ అందించే కార్యక్రమాన్ని చేపట్టాం.
-హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి
ఇదీ చదవండి: TAMILISAI: ఆదివాసీల జీవన విధానంపై సర్వే.. త్వరలోనే మ్యూజియం