కొండపోచమ్మ జలాశయం నుంచి ఈనెల 24న ఎడమ కాలువ నుంచి మార్కుక్ జగదేవపూర్ మండలాలతోపాటు ఆలేరు నియోజకవర్గం చెరువులను నింపేందుకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ కాలువ ద్వారా వెళ్తున్న నీటి ప్రవాహంతో మార్కుక్ మండల శివారు వెంకటాపూర్ సమీపంలో కాలువకు గండిపడింది. దీనితో నీటి ప్రవాహం పంట పొలాల మీదుగా గ్రామంలోకి.. అక్కడి నుంచి ఇళ్లలోకి నీరు చేరింది.
3 గంటల పాటు నీటి ప్రవాహం
నీటిలో ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. మూడు గంటలపాటు కాలువల నీటి ప్రవాహం అలాగే కొనసాగింది. అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎంసీ హరిరామ్, ఎస్ఈ వేణులు జలాశయం నుంచి కాలువలకు వెళ్లే నీటిని నిలిపివేశారు. అనంతరం కాలువ మరమ్మతు చర్యలను ప్రారంభించారు.
నష్టంపై అధికారుల ఆరా
మరోవైపు స్థానిక అధికారులు గ్రామంలో నీట మునిగిన ఇండ్ల నష్టపరిహారాన్ని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పంటనష్టంపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన తెల్లవారుజామున జరగడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రాత్రి సమయంలో జరిగి ఉంటే.. నిద్రలో ఎంతోమంది ప్రాణాలు పోయేవని గ్రామస్థులు తెలిపారు.
నీటిని విడుదల చేసి.. వారం రోజులు గడవకముందే కాలువకు గండి పడటం వల్ల స్థానికంగా పలు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. నాణ్యత లోపంతోటే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా