కొత్త ఆలోచనలు.. కొత్త ఆవిష్కరణలకు నాంది పలకడం.. మెరుగైన ఆలోచనలకు తోడ్పాటునందించడమే లక్ష్యంగా టీహబ్ ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామీణ ఇన్నోవేషన్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ బృంద విద్యార్థులు శుక్రవారం సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల ఆలోచనా విధానం గురించి తెలుసుకున్నారు.
గ్రామంలో పర్యటించి వారు చేసిన పనుల గురించి ఆరా తీశారు. ఇంకుడు గుంతలు, గొర్రెల షెడ్లు, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పార్కు , పాఠశాలలను సందర్శించారు. గ్రామీణ విద్యార్థుల్లో దాగి ఉన్న సరికొత్త ఆలోచనలను వెలికి తీసి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం, సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు రూపొందించడం యాత్ర ముఖ్య ఉద్దేశమని విద్యార్థులు అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా, ఎలాంటి మార్పులు చేయాలని పలువురు గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి : 'వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు అందరి కృషి అవసరం'