పర్యావరణ పరిరక్షణతో పాటు సర్వ మానవాళికి ప్రాణ వాయువును అందించే మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని హుస్నాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ ఆకుల రజిత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం పథకాన్ని విజయవంతం చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బేతేలు ప్రార్థనా మందిరం ఆవరణలో ఛైర్పర్సన్ ఆకుల రజిత, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులతో కలిసి ఎర్రచందనం మొక్కలు నాటారు. అంతకుముందు చర్చిలో కరోనా నిర్మూలనతో పాటు సర్వ మానవాళి హితాన్ని కాంక్షిస్తూ ఫాదర్ శేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం 'జై హరితహారం-జైజై హరితహారం, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు' అంటూ నినాదాలు చేస్తూ మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను బతికించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె సూచించారు. పట్టణంలోని ప్రతి వార్డుతో పాటు చర్చి ఆవరణల్లో విరివిగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొంకట నళినీ దేవి, బోజు రమా, కో ఆప్షన్ సభ్యులు అయిలేని శంకర్ రెడ్డి, ఆయూబ్ పాషా, బొల్లం శ్రీలత, పాస్టర్లు శేఖర్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మైదానం తెరుచుకోలేదు.. వ్యాయామం చేసేదెట్ల?