లాక్డౌన్ పటిష్టంగా అమలయ్యేలా పోలీసులు నిత్యం కృషి చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సీఐ రఘు ప్రతిరోజు పట్టణంలో కాలినడకన తిరుగుతూ లాక్డౌన్ పటిష్టంగా అమలు అయ్యేలా చూస్తున్నారు. పట్టణంలోని వీధుల్లో సాయంత్రం వేళ కాలినడకన తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతున్నారు. వీధుల్లో ఉన్న వయస్సు పైబడిన వారిని మందలిస్తూ... కరోనా టీకా వేయించుకున్నారా అని అడుగుతూ... వేయించుకోకపోతే కచ్చితంగా టీకాలు వేయించుకోవాలని సూచిస్తున్నారు.
సాయంత్రం వేళ ఇంటి ఆరు బయట కూర్చుని మాట్లాడుకుంటున్న పలువురు కుటుంబ సభ్యులను పలకరిస్తూ... అందరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కూలు ధరించి మాట్లాడుకోవాలని తెలిపారు. వీధుల్లో వాహనాలపై, కాలినడకన తిరుగుతున్న పలువురిని గుర్తించి వారిని ఎందుకు తిరుగుతున్నారనీ అడిగి తెలుసుకున్నారు. ఆకారణంగా బయటకు రావద్దని మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ అత్యవసరం అయితేనే బయటికి రావాలని వారికి సూచించారు. అకారణంగా బయట తిరుగుతున్న పలువురికి కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానాలు విధించారు. సీఐ రఘు ఇలా కాలినడకన వీధుల్లో తిరుగుతూ ప్రజలకు కరోనా జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: సెంట్రల్ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట