భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు... కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నేతృత్వంలోని అధికారుల బృందం... తెలంగాణలో పర్యటిస్తోంది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా మొదటగా సచివాలయంలో సీఎస్ సోమేశ్‌కుమార్, ఉన్నతాధికారులతో కేంద్రబృందం సమావేశం కాగా... వివిధశాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు... వరదల పరిస్థితి, నష్టం, చేపడుతున్న సహాయక చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
వాటిల్లిన భారీ నష్టం...
పది రోజులుగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్, పరిసర జిల్లాలో భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. మూసీ నదికి వరద సహా నగరంలో 3 చెరువులకు గండిపడటం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని వివరించారు. ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు సీఎస్... కేంద్ర బృందానికి తెలిపారు. తక్షణ సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 550 కోట్లు విడుదల చేసిందని, రెండు లక్షల మందికి ఆహార పొట్లాలు అందించినట్లు చెప్పారు.
నష్టాన్ని వివరించిన ఓవైసీ...
వరదల వల్ల కలిగిన నష్టంపై ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్రం బృందం పరిశీలించింది. అనంతరం 2 బృందాలుగా విడిపోయి ఒక బృందం జీహెచ్ఎంసీలో, మరో బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. మొదట చంద్రాయణగుట్టలోని కందికల్ గేట్ వద్ద ఉన్న నాలా పునరుద్ధరణ పనులను పరిశీలించిన అధికారులు... తర్వాత పూల్‌బాగ్‌లోని వరద ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర బృందానికి వరదలతో జరిగిన నష్టాన్ని వివరించారు. దాదాపు 10 అడుగులకు పైగా రోడ్లు, ఇళ్లు వరద ముంపునకు గురయ్యాయని, తీవ్రంగా నష్టపోయిన ప్రజలను... కేంద్రం ఆదుకోవాలని కోరారు.
ప్రత్యేక శ్రద్ధ...
పల్లె చెరువుకు పడిన గండిని పరిశీలించిన అధికారులు... పునరుద్ధరణ పనులను పరిశీలించారు. పల్లె చెరువు, గుర్రం చెరువులు తెగిపోవడం వల్ల బాలాపూర్ చెరువు పొంగి పొర్లి హఫీజ్ బాబానగర్‌లోని పలు కాలనీలు, ఇళ్లను ముంచెత్తగా ఆ వివరాలు తెలుసుకున్నారు. ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు... చెరువుల పటిష్టతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని... కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న ప్రవీణ్ వశిష్ఠ అభిప్రాయపడ్డారు.
ఇవాళ్టి పర్యటనలో చివరిగా అప్పాచెరువు, గగన్ పహాడ్ వద్ద అప్పాచెరువు నాలాను పరిశీలించారు. గగన్‌పహాడ్‌లోని పలు కాలనీలు, ఇళ్లు ముంపుకు గురయ్యాయని పలు వాహనాలు వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.
సిద్దిపేట జిల్లాలో...
రెండో బృందం సిద్దిపేట జిల్లా మార్కుక్, ములుగు మండలం చిన్న తిమ్మాపూర్ గ్రామాల్లోని వరి, పత్తి పంటలు పరిశీలించింది. రైతులను, అధికారులను అడిగి పంట నష్టం వివరాలు తెలుసుకుంది. పలువురు రైతులు వర్షాలకు దెబ్బతిన్న తమ పత్తి మొక్కలు తీసుకొచ్చి కేంద్ర బృందానికి చూపించారు. తర్వాత మర్కుక్‌లోని కొండపోచమ్మ పంప్‌హౌస్‌ను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. శుక్రవారం కూడా కేంద్ర బృందాలు... వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నాయి.