Harish Rao at Siddipet : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. రూ.160 కోట్ల రీజినల్ రింగ్ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. సిద్దిపేట చుట్టూ ఏడు మండలాలను కలిపే ఈ రీజినల్ రింగ్ రోడ్డు జిల్లాకు మణిహారం అని మంత్రి అన్నారు. దీనివల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. జిల్లాకు పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ పథకాలతో అన్నదాతల పక్షపాతిగా సీఎం కేసీఆర్ మారారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులెదురైనా... రైతుబంధు సొమ్ములు ఆపడం లేదన్న మంత్రి ప్రజా సంక్షేమమే సర్కార్ ధ్యేయమని పునరుద్ఘాటించారు. మిగతా ప్రభుత్వాలు రైతుల నుంచి పన్ను వసూల్ చేస్తే.. కేసీఆర్ మాత్రం కర్షకులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నారని కొనియాడారు.
భాజపా సర్కార్.. విద్యుత్ మీటర్లు పెట్టమని రైతుల మెడకు ఉరి తాడు వేలాడేస్తోందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఏపీలో బావుల వద్ద మీటర్లు పెడతామని నిధులు తెచ్చుకున్నారని తెలిపారు. రైతుల కోసం కేసీఆర్ రూ.25వేల కోట్లు వద్దనుకున్నారని వెల్లడించారు. వరి ధాన్యం కొనుగోలు చేయలేని కాషాయ ప్రభుత్వం ప్రజలను నూకలు తినాలని చెబుతూ అవమానించిందని ఆరోపించారు. ఖాతాల్లో పడుతున్న నగదు చూసి కర్షకుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోందని అన్నారు.