HarishRao inaugurate Rythuvedika in Chinnagundavelli: ఈ యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల ఎకరాల విస్తీర్ణలో వరి పంటను సాగు చేస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 16 లక్షల ఎకరాలు వరి సాగు చేశారని, సకాలంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు శ్రేయస్సుకై చేసిన కృషితో ఇది సాధ్యమైందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్లి గ్రామంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్మన్ రోజాశర్మతో కలిసి రైతువేదిక, యోగ కేంద్రంను ప్రారంభించారు.
తెలుగుదేశం రాకముందు తెలంగాణ ప్రజలు జొన్న గట్క, మక్క గట్క తప్ప ఏమీ తినలేదని, తామే అన్నం పెట్టడం నేర్పామని చంద్రబాబు చెప్పడం విడ్డురంగా ఉందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ఆలోచనలతో అనేక సంక్షేమ పథకాలతో గొప్ప మార్పు వచ్చి అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకమైన పంటగా వివరిస్తూ.. ఆయిల్ ఫామ్ సాగు కోసం బడ్జెట్లో వెయ్యికోట్ల సబ్సిడీ కింద అందిస్తున్నామని, రైతులు ఆయిల్ ఫామ్ పంటలు సాగుచేసే దిశగా అడుగులు వేయాలని కోరారు. రైతులకు మేలు చేకూర్చాలన్నదే కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమని, తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తోందని మంత్రి వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ప్రతిపక్షనాయకులకు ఏమని విమర్శించాలో.. అర్థం కాక, తెలియక సతమతమవుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలు చేయడం చేతకాక ఆప్రాంత నేతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
"ఈ సంవత్సరం యాసంగిలో రాష్ట్రంలో ఎన్ని ఎకరాలల్లో వరి పంటను సాగు చేస్తున్నారో సర్వే చేశాం. తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 16 లక్షల ఎకరాలు వరి సాగు చేశారు. రైతుబంధు, సకాలంలో ఎరువులు, కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటి వసతిని కల్పించడం ద్వారా రైతులకు పంట పండుతుందనే భరోసా కలిగింది. ఈనాడు తెలంగాణ రాష్ట్రం పండిన ధాన్యంతో నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతోంది. తెలుగుదేశం రాకముందు ఇక్కడి ప్రజలు జొన్న, మక్క గట్క తప్ప ఏమీ తినలేదని, తానే అన్నం పెట్టడం నేర్పానని టీడీపీ చంద్రబాబు చెప్పడం విడ్డురంగా ఉంది. వ్యవసాయ బోర్లకు మీటర్లను పెట్టమని కేంద్రం చెబుతున్నా ససేమిరా ఒప్పుకునేది లేదు. రైతులందరికి ఉచిత విద్యుత్త్ అందిస్తాం".-హరీశ్‌రావు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి
ఇవీ చదవండి: