సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లికి చెందిన ఉసికే చంద్రం(45) గ్రామంలోని పెద్ద చెరువుకు ఉదయం చేపల వేటకు వెళ్లాడు. మధ్యాహ్నం కావస్తున్నా ఇంటికి తిరిగి రాకపోవటం వల్ల కుటుంబసభ్యులు చెరువు వద్దకు వెళ్లి చూశారు. విగతజీవిగా పడి ఉన్న చంద్రాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
మత్స్య వృత్తి జీవనాధారంగా బతికే చంద్రం... కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. చంద్రానికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న భూంపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.