సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజవర్గంలోని రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ ప్రగతి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాలువ భూసేకరణ.. ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సమావేశానికి హాజరయ్యారు.
దుబ్బాక నియోజకవర్గంలో నిర్మాణాలు పూర్తైన రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3 కోట్లు మంజూరు చేసినట్లు హరీశ్‌రావు తెలిపారు. విద్యుత్, మురుగునీటి కాలువల నిర్మాణం, తాగునీరు, అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు. జులై 10లోగా డబుల్ బెడ్రూం ఇళ్లను ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు.
కాళేశ్వరం ఫలాలు అందాలంటే డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం తప్పనిసరని మంత్రి అన్నారు. ప్రధాన సాగునీటి కాల్వల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసినట్లు చెప్పారు. దుబ్బాక నియోజవర్గం పరిధిలో కాల్వల నిర్మాణానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించి.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
ఇదీచూడండి: ఆహార భద్రత స్థాయి నుంచి ఆహార భరోసా స్థితికి చేరుకున్నాం: కేసీఆర్