బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా.. సిపాయిలకు సహాయం చేసి గూఢచారులుగా వ్యవహరించిన ఘనత గిరిజనులదని మాజీ ఎంపీ సీతారాంనాయక్ కొనియాడారు. 1857 సిపాయిల తిరుగుబాటులో వాళ్లకి మద్దతుగా నిలిచి బ్రిటిష్‌వారి చేతిలో మరణించిన చరిత్ర తమదేనన్నారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌడుతండాలో శ్రీ సంతు సేవాలాల్ మహరాజ్ 282వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గిరిజన నేత తిరుపతి నాయక్ ఏర్పాటు చేసిన భోగ్ బండార్ కార్యక్రమంలో సీతారాంనాయక్, అల్ ఇండియా బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్ నాయక్ పాల్గొన్నారు.
ఒక్కరు 100 మందిని చంపగలరు..
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ వంశానికి చెందిన రామ్ రాజ్ మహారాజ్ ఈ మధ్యకాలంలో మరణించారని, వారి ఆత్మ శాంతికి అందరూ ప్రార్థించాలని మాజీ ఎంపీ కోరారు. లంబాడీలు అనే పదంలో 'లంబా' అంటే ఒక వ్యక్తి 100 మందిని చంపగల బలవంతుడని అర్థమన్నారు. సిపాయిలకు సహాయం చేసినందుకు 1871లో క్రిమినల్ ట్రైబల్స్ యాక్ట్ బ్రిటిష్ వారు తీసుకొచ్చి గిరిజనులపై ఆంక్షలు విధించారని తెలిపారు.
కేసీఆర్ హామీ..
27 జూలై 1977 నుంచి గిరిజనులుగా కొనసాగుతున్నామని, ఇప్పుడు ఎవరో మన హక్కులు భంగం కలిగించేలా కేసులు వేస్తామంటే భయపడేది లేదన్నారు. వివాహాది శుభకార్యాలకు ముందు చేసే భోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించిన తిరుపతి నాయక్‌ను అభినందించారు.
గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ త్వరలో నెరవేర్చేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో అక్కన్నపేట మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ప్రతి జిల్లా పరిషత్‌కు రూ.10 కోట్లు..!