మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాల్వల భూసేకరణకు సంబంధించి రైతులకు పరిహారం విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ సిద్దిపేట జిల్లా ధర్మారం రైతులు రోడ్డుపై బైఠాయించారు. గ్రామంలో కాల్వల నిర్మాణానికి అధికారులు సుమారు 60 మంది రైతుల వద్ద 30 ఎకరాల వరకు సాగు భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాము వ్యతిరేకం కాదని, భూమిని కోల్పోతున్న రైతులకు పరిహారం కేవలం రూ. లక్షా 90 వేలు మాత్రమే ఎకరానికి కేటాయించారన్నారు.
మార్కెట్ రేటుకు అనుగుణంగా భూములకు ధరలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల ఆందోళనలతో కిలోమీటర్ మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.