ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకలో నేడు పర్యటించనున్నారు. తమ ఊరి బిడ్డ రాక కోసం గ్రామస్థులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు పర్యవేక్షణలో అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభం
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చిన కేసీఆర్ తన బాల్య మిత్రులను, గ్రామస్థులను పలకరించి త్వరలో మరోసారి గ్రామానికి వస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్థులకు ఇచ్చిన మాట ప్రకారం.... నేడు గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండనున్నారు. గ్రామస్థులతో సమావేశమై వారి బాగోగులు, సమస్యలు తెలుసుకోనున్నారు. సహపంక్తి భోజనం చేయనున్నారు. గ్రామంలోని వీధుల్లో పర్యటించి... పలు ఆలయాలను సందర్శించనున్నారు. గ్రామంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభంతో పాటు బీసీ గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
సీఎం హామీకి అనుగుణంగా ప్రణాళికలు
గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్, సర్పంచ్‌కు సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో శాఖల వారీగా రంగంలోకి దిగిన అధికారులు గ్రామస్థుల ఆర్థిక స్థితిపై ఇంటింటి సర్వే నిర్వహించారు. గ్రామాభివృద్ధి కోసం ఇప్పటికే పది కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఆర్థికంగా పరిపుష్టం అయ్యేలా ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయల వరకు సహాయం అందిస్తామన్న సీఎం హామీకి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తిరిగి గ్రామానికి చేరుకుంటున్నారు.
భారీ బందోబస్తు
సీఎం పర్యటన నేపథ్యంలో గ్రామంలో భారీగా ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా పోలీసు బందోబస్తును మొహరించారు. సభా వేదిక, సామూహిక భోజన ప్రాంగణాల వద్ద విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. గ్రామ ప్రజలకు గులాబీ, అధికారులకు తెలుపు, మీడియా ప్రతినిధులకు ఆకుపచ్చ రంగు గుర్తింపు కార్డులను అందజేశారు. సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు గ్రామస్థులు సిద్ధమవుతున్నారు.
ఇదీ చూడండి: ఉజ్జయినీ బోనం... మురిసింది భాగ్యనగరం