Telangana Seed Certification Agency: సిద్దిపేటలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ భవనానికి భూమిపూజ చేసి... మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. విత్తనోత్పత్తికి సిద్దిపేట జిల్లా అన్ని విధాలా అనుకూలమని మంత్రి వెల్లడించారు. త్వరలోనే సిద్దిపేట సీడ్ హబ్‌గా మారనుందన్నారు. నాణ్యమైన ధృవీకరణ చేసిన విత్తనాలు ఉత్పత్తి చేసి.. రైతులకు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. జిల్లాలో విత్తనోత్పత్తి, విత్తన ధృవీకరణకై సేవలు విస్తృతం చేస్తున్నామని స్పష్టం చేశారు.
రైతులు డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలను సాగు చేయాలి. ఆయిల్ ఫామ్, సెరి కల్చల్, పప్పు దినుసులు, పల్లి వంటి డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలను రైతులు సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయి. విత్తనోత్పత్తికి సిద్దిపేట జిల్లా అన్ని విధాలా అనుకూలం. త్వరలోనే సిద్దిపేట సీడ్ హబ్‌గా మారనుంది. సిద్దిపేట సమీకృత మార్కెట్‌కు తొలి ఐఎస్ఓ సర్టిఫికెట్ రావడం ఆనందంగా ఉంది. ఇది జిల్లా ప్రజలందరికీ గర్వకారణం. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గత రెండేళ్లుగా మార్కెట్ అభివృద్ధికి కృషి చేశారు. ఆదాయం పెంపొందించే కార్యక్రమాలను చేపట్టి సఫలీకృతమయ్యారు.
పనిలేక కాదు... 4 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం దిల్లీ వచ్చాం. గతంలో దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ వడ్ల కొనుగోలు చేశాయి. అదేరీతిలో ఇప్పుడు కూడా తెలంగాణలో పండించిన వడ్లు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించేందుకు.. కేంద్ర మంత్రులు కలిసేందుకు.. వచ్చాం. తెలంగాణ మంత్రులు చెప్పే అంశాలను కనీసం వినేందుకు కూడా ఇష్టపడకుండా... పని లేక పదేపదే దిల్లీకి వస్తున్నారని హేళన చేయడం సరికాదు.
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రానిది ద్వంద్వనీతి చూపిస్తోంది. ఇది రైతులకు అర్థమయ్యేలా చెప్పాలి. ఆహార భద్రత అంశం కేంద్రం పరిధిలో ఉంది. కేంద్రం వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసింది. రైతుల పోరాటంతోనే కేంద్రం వెనక్కి తగ్గి.. నల్ల చట్టాలు రద్దు చేసింది.
-మంత్రి హరీశ్ రావు
ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ నీతిని అవలంభిస్తోందని.. రైతులకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలని మంత్రి హరీశ్ రావు.. తెరాస నేతలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: Don't waste food : మోదీ మెచ్చిన యువకుడు.. ఆకలి తీర్చే ఆపద్భాందవుడు