సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) నారింజ ప్రాజెక్టులో పూడికతీత పనులను ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. 50 లక్షల నిధులతో 600 ఎకరాల భూమిలో పేరుకుపోయిన పూడికతీత పనులను పది రోజుల్లో పూర్తిచేయాలని ఎంపీ, ఎమ్మెల్యే గుత్తేదారులను ఆదేశించారు. జహీరాబాద్ డివిజన్ ప్రజలకు జీవనాధారమైన నారింజ ప్రాజెక్టు పూడికతీతతో భూగర్భ జలాలు పెరుగుతాయని ఎమ్మెల్యే మాణిక్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
పర్యాటక ప్రదేశంగా..
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సహకారం వల్ల ప్రాజెక్టు ఆయకట్టు పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావులు అన్నారు. ఇందుకు సహకరిస్తూ జిల్లా పాలనాధికారి ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. భారీ యంత్రాల సహాయంతో తీస్తున్న పూడికను రైతులు పంట పొలాలకు తరలించి భూములు సారవంతం చేసుకోవాలని కోరారు. ప్రతి వర్షపు చుక్క భూమిలో ఇంకెలా చూడాలని గేట్ల నుంచి నీరు లీక్ కాకుండా పటిష్టంగా మరమ్మతులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి: చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు