సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కేంద్రంలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. సదాశివపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు హాజరైన మంత్రి హరీశ్‌రావును కలిసి.. తన బాధలు చెప్పుకుందామని ప్రయత్నించినా మహిళకు నిరాశే ఎదురవగా.. తీవ్ర మనస్తాపానికి గురై... ఊబచెరువులో దూకేందుకు యత్నించింది.
సిద్దాపూర్‌కు చెందిన జ్యోతి అనే మహిళ... తన భర్తను కొన్ని నెలల ముందు కోల్పోయింది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవటం వల్ల ఇద్దరు పిల్లలతో బతుకు భారంగా మారింది. కూలి పని చేసుకుంటూ అతికష్టం మీద పిల్లలను పోషిస్తున్న తనకు ఇంటి కిరాయిలు కట్టటం తలకు మించిన భారంగా మారుతోందని జ్యోతి వాపోయింది. మంత్రిని కలిసి తన గోడు వెళ్లబోసుకుని... ఓ ఇల్లు కావాలని వేడుకునేందుకే కార్యక్రమానికి హాజరైనట్టు తెలిపింది.
ఎంత ప్రయత్నించినా... మంత్రిని కలవటం వీలుపడకపోవటం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇక తన కష్టాలు తీరేమార్గమే లేదని భావించిన జ్యోతి.. ఆత్మహత్యకు యత్నించింది. ఊబచెరువులో దూకేందుకు యత్నిస్తున్న జ్యోతిని అక్కడే ఉన్న స్థానికులు.. అడ్డుకున్నారు. అధికారులు ఆమెకు సర్దిచెప్పారు. తన అభ్యర్థనను నెరవేరుస్తామని అధికారులు మాట ఇవ్వగా.. జ్యోతి అక్కడి నుంచి వెళ్లిపోయింది.