Sugarcane farmers problems: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం చెరుకు సాగుకు ప్రసిద్ధి. పండించిన చెరుకును జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) ట్రైడెంట్ కర్మాగారానికి తరలిస్తారు. యాజమాన్యం ప్రతినిధుల మధ్య సమన్వయ లోపంతో గడచిన రెండేళ్లు గానుగ ప్రారంభించలేదు. ఈ సంవత్సరం రైతులు పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో... ఈ నెల 5న గానుగ ప్రారంభమైంది. యంత్రాల్లో సమస్య తలెత్తి రెండు రోజులకే మళ్లీ గానుగ నిలిచిపోయింది. చేసేదిలేక జహీరాబాద్ పరిసరాల రైతులు సమీపంలోని కర్ణాటక బాల్కిలోని బాలీకేశ్వర్ కర్మాగారానికి చెరుకును తరలిస్తున్నారు.
Sugarcane farmers sangareddy: కొత్తూరు ట్రైడెంట్ చక్కెర కర్మాగారానికి జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలతో పాటు వికారాబాద్ జిల్లాలోని తొరమామిడి ప్రాంత రైతులు చెరుకును తరలిస్తారు. మూడు నియోజకవర్గాల్లో దాదాపుగా 20 వేల ఎకరాల్లో తొమ్మిది లక్షల టన్నుల వరకు చెరుకు సాగవుతోంది. ఎకరా సాగుకు 20 నుంచి 30 వేల ఖర్చు చేయాల్సి వస్తుంది. పంట సాగుకు ముందే కర్మాగారం వద్ద రైతులు కోత, రవాణా, గానుగ కోసం ఒప్పందం చేసుకుంటారు. అయితే పంట చేతికందే సమయానికి కర్మాగారం గానుగ ప్రారంభించక పోవడంతోనే అసలు సమస్య మొదలవుతోంది. చేసేది లేకపోవడంతో రైతులు కర్ణాటకలోని బాల్కీ, గుల్బర్గాలోని చక్కెర కర్మాగారాల యజమాన్యాలను బతిమిలాడుకుంటున్నారు. అక్కడి కర్మాగారాలు టన్నుకు 2,200 చొప్పున ఇస్తుండడంతో రాష్ట్రం ధరతో పోలిస్తే టన్నుకుకు వెయ్యి రూపాయల వరకు నష్టం వాటిల్లుతోంది.
Sugarcane farmers jaheerabad జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర కర్మాగారం టన్నుకు 3వేలు చెల్లిస్తామని ప్రకటించడంతో చెరుకు రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది. గానుగ ప్రారంభించిన రెండు రోజుల్లోనే కర్మాగారం మళ్లీ మూతపడడంతో ఆందోళన మొదలైంది. సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం దృష్టి సారించకపోతే చెరుకు సాగును వదిలేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.