సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలో వారం రోజుల్లో నీటి సమస్యని పరిష్కరించకపోతే స్థానిక ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని, అలాగే సీఎం కేసీఆర్ని అడ్డుకుంటామని రాష్ట్ర భాజపా నాయకులు, సమస్యల సాధన కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా నీళ్లు, నిధులు, నియామకాలు నెరవేరలేదని ఆరోపించారు. పటాన్చెరు మండలం ముత్తంగి భాజపా కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో సమస్యల సాధన కమిటీ.. సమావేశం నిర్వహించింది.
జిల్లాకు తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే బీరు కంపెనీలకు, పరిశ్రమలకు నీళ్లు అమ్ముకుంటున్నారని శ్రీకాంత్ గౌడ్ మండిపడ్డారు. మంజీరా నీళ్లు జిల్లా వాసుల హక్కు అని.. ప్రజలకు అందించిన తర్వాతే ఎవరికైనా ఇచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నీటి సమస్య ఉందని తెలిపారు. ముఖ్యంగా బొల్లారం మున్సిపాలిటీలో అధికార పార్టీలోని వర్గ విభేదాలతో నీటి సమస్య తీరడం లేదని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: కొత్త వ్యవసాయ చట్టం వల్ల రైతులకు తీవ్ర నష్టం: సీపీఎం