సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం... దాని అనుబంధ రంగాలు కాకుండా పరిశ్రమల తర్వాత ఎక్కువ మంది ఉపాధి పొందుతోంది నిర్మాణరంగంలోనే. భవన, ఇతర నిర్మాణ పనుల్లో జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు.
భవన నిర్మాణ సంక్షేమ బోర్డు కింద జిల్లాలో నమోదైన వారు 36వేల మంది ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 15,699 మంది ఉండగా మిగతా వారంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేసేందుకు అనుమతించారు. పట్టణ ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టేందుకు జిల్లా పరిశీలన కమిటీ ద్వారా అనుమతులు పొందాల్సి ఉంటుంది. జిల్లాలోని పట్టణాల్లో దాదాపు 23 నిర్మాణరంగ సంస్థలున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇటుక బట్టీల్లో...
జిల్లాలో 141 ఇటుక బట్టీలు ఉన్నాయి. ఆయా బట్టీలపై ఆధారపడి సుమారు 2వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటంతో ఉత్పత్తులు ప్రారంభించేందుకు అవకాశం కల్పించారు. ఆయా కుటుంబాల ఉపాధికి అడ్డంకులు తొలగనున్నాయి.
భౌతిక దూరం.. శానిటైజేషన్ తప్పనిసరి...
గ్రామీణ ప్రాంతాల్లో అనుమతించిన పరిశ్రమలు, ఇటుకబట్టీలు, నిర్మాణ పని ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు పాటించడం తప్పనిసరి. పనిచేసే చోట కార్మికులు భౌతిక దూరం పాటించేలా చూడాలని నిబంధన పెట్టారు. విధులకు హాజరయ్యే సమయంలో వారి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించాలి. శానిటైజర్లు, మాస్కులు, చేతి తొడుగులు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది.
తనిఖీలకు ఆరు బృందాలు...
పరిశ్రమలు, పని ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్నది పరిశీలించేందుకు పాలనాధికారి హనుమంతరావు ఆరు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. కార్మిక శాఖ, పరిశ్రమలు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఈ బృందాల్లో సభ్యులుగా ఉంటారు. ‘పని ప్రదేశంలో భౌతిక దూరం పాటించాలని సహాయ కార్మిక అధికారి యాదయ్య స్పష్టం చేశారు. అలాగే శానిటైజర్లు, మాస్కులను యాజమాన్యాలు సమకూర్చాలని సూచించారు.