Pure EV company new innovation: ఐఐటీ హైదరాబాద్ అంకుర సంస్థ ప్యూర్ ఈవీ.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా... అభివృద్ధి చెందుతోంది. నిరంతర పరిశోధనలతో అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలకు సైతం లేని.. అత్యాధునిక సాంకేతికతను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో తన సత్తా చాటుతున్న ప్యూర్ ఈవీ తాజాగా విడుదల చేసిన.. ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌తో మరో మైలురాయి దాటింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యుత్ మోటార్ సైకిళ్లు.. సాధారణ ప్రజల నిత్యజీవిత కార్యకలాపాలకు అనుగుణంగా లేకపోవడంతో.. వినియోగదారుల నుంచి పూర్తి స్థాయిలో ఆసక్తి లభించడం లేదు. దీనిని గుర్తించిన ప్యూర్ ఈవీ ఈ సరికొత్త ఆవిష్కరణ చేసింది.
ఐఐటీ హైదరాబాద్- ప్యూర్ ఈవీ పరిశోధనా కేంద్రంలో అభివృద్ధి చేసిన 3 కిలోవాట్ బ్యాటరీని ఈ వాహనంలో వినియోగించారు. దీనిపై వీరికే పేటెంట్ ఉండటంతో పాటు.. గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగం దీని ప్రత్యేకత. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 135 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని.. ప్రయాణికుల భద్రత, రక్షణ కోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించినట్లు సంస్థ స్పష్టం చేసింది. ఈ విద్యుత్ మోటార్ సైకిల్‌ను ఎకోడ్రిఫ్ట్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేశారు.
పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా.. ఎకోడ్రిఫ్ట్ అనుభూతిని ఇస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఓ సగటు భారతీయ వినియోగదారుని అంచనాలను దృష్టిలో పెట్టుకుని... దీనిని రూపొందించినట్లు.. ప్యూర్ ఈవీ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ నిశాంత్ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్యూర్ ఈవీ ఔట్‌లెట్లు.. ఈ వాహనాన్ని వినియోగదారుల డెమో కోసం అందుబాటులో ఉంచామని.. సంస్థ సీఈవో రోహిత్ వాద్రా తెలిపారు.
సామాజిక అవసరాల కోసం మోటారు సైకిల్‌ను తయారు చేశాం. సగటు వాహనదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించాం. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా వీటిని ప్రారంభిస్తున్నాం. బైక్ గరిష్ఠ వేగం గంటకు 75 కిలోమీటర్లు. రోజూ ఉపయోగించే వాళ్లని దృష్టిలో పెట్టుకుని తయారు చేశాం. భద్రత విషయంలో పూర్తి చర్యలు తీసుకున్నాం. నూతన నిబంధనలను అనుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. విదేశాలకు సైతం తమ వాహనాలు ప్యూర్ ఈవీ ఎగుమతి చేస్తోంది. ఇప్పటికే తమ ఉత్పత్తులను దక్షిణాసియా దేశాలు సహా దక్షిణ అమెరికా, ఆఫ్రికా మార్కెట్‌లకు విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇవీ చదవండి:
- 'టీడీపీపై ప్రేమ ఉంటే ఏపీలో ఎన్టీఆర్‌ను సీఎం చేయండి'
- హైదరాబాద్‌వాసులు మళ్లీ బిర్యానీకే జై.. ఆ తర్వాతి స్థానాల్లో ఏం ఉన్నాయంటే?
- భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. టీకా తీసుకున్నా వస్తుందా?.. ఎలా పుట్టుకొచ్చింది?