కరోనా బారిన పడి కోలుకున్న వారిని ఇప్పుడు మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) వేధిస్తోంది. చాలామంది ఈ సమస్యతో ఆసుపత్రుల వద్ద బారులు దీరుతున్నారు. మరణాలూ సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో తాము ఫంగస్ ఇన్ఫెక్షన్లకు సమర్థంగా చికిత్స అందించేందుకు కొత్త మాత్రను తయారుచేశామని ఐఐటీ ప్రకటించింది.
ఆంఫోటెరిసిన్-బి ఔషధాన్ని జెలిటిన్ పాలిమర్‌లో ఉంచి ఎలక్ట్రో స్పిన్నింగ్ ద్వారా నానోఫైబర్స్‌ను అభివృద్ధి చేశారు. వీటిని క్రాస్‌లింక్ చేస్తూ మాత్రలను తయారుచేశారు. రోగి వీటిని వాడినప్పుడు అవసరం మేరకు ఔషధం కొద్దికొద్దిగా శరీరంలోకి విడుదలవుతూ ఉండడం దీని ప్రత్యేకత. దీని వల్ల ఇతర దుష్ప్రభావాలూ గణనీయంగా తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఐఐటీ హైదరాబాద్‌లోని కెమికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ శర్మ, డాక్టర్ సప్తర్షి మజుందార్ దీన్ని కనిపెట్టారు. ఆంఫోటెరిసిన్-బి ఔషధాన్ని ఇంజక్షన్ రూపంలో తీసుకుంటే ఒకేసారి అది రక్తంలో కలిపిపోతుంది. దీనివల్ల కిడ్నీలపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. ఇంజక్షన్లకయ్యే ఖర్చూ అధికమే. నోటి ద్వారా మాత్రల రూపంలో ఆ మందు తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయని వారు తెలిపారు.
ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ బారిన పడుతూ మరణాలు సంభవిస్తున్న తరుణంలో సాంకేతికతను వాడుకొని మాత్రలను ఉత్పత్తి చేసేందుకు ఫార్మా పరిశ్రమలు ముందుకు రావాలని వీరు కోరుతున్నారు. రూ.200 లోపే ఖర్చుతో 60 మిల్లీ గ్రాముల ఆంఫోటెరిసిన్-బి మాత్రను తయారు చేయవచ్చంటున్నారు. ‘ఆంఫోటెరిసిన్-బి ఔషధం బ్లాక్ ఫంగస్ మీద బాగా పనిచేస్తుంది. సమస్యల్లా దానిని ఇంజక్షన్ రూపంలో తీసుకోవాల్సి రావడమే. మేము సాంకేతికతను ఫార్మా కంపెనీలకు ఇవ్వడానికి ముందుకొచ్చాం. త్వరగా ఉత్పత్తి మొదలయ్యేలా చొరవ తీసుకోవాలని కోరుతున్నాం.’ అంటున్నారు చంద్రశేఖర్‌శర్మ.
ఇవీచూడండి: 'పాఠ్యాంశంగా విపత్తు, మహమ్మారి నిర్వహణ'