ఆటలు.. పాటలు.. కోలాటాలు.. వివిధ రకాల ధాన్యాలతో అందంగా అలంకరించిన ఎద్దుల బండ్ల ప్రదర్శన. ఈ సందడంతా విత్తనాల పండుగే. సేంద్రీయ విధానంలో చిరు ధాన్యాల సాగు, వాటి వినియోగంపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకే దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ 20 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా ఈ సొసైటీ కొనసాగుతోంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, శాస్త్రవేత్తలు, పరిశోధన కేంద్రాలు, ఇతర సేవా సంస్థలు ఒకే వేదిక మీదకు వచ్చేలా పాత పంటల జాతరను రూపొందించారు.
రోజుకో ఊరిలో..
ఏటా సంక్రాంతి సందర్భంగా ప్రారంభమయ్యే ఈ జాతర 30 రోజుల పాటు కొనసాగుతుంది. రోజుకో ఊరిలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. జానపద పాటలు, కోలాటాలు, బుర్ర కథ, చిడతల కథ వంటి విధానాల్లో చిరుధాన్యాల సాగు విధానం, ఆవశ్యకతను రైతులకు అర్థమయ్యే విధంగా వివరిస్తారు. 20 పాత పంటల జాతర పస్తాపూర్ గ్రామంలో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డీజీ డబ్ల్యూఆర్ రెడ్డి పాల్గొన్నారు. మాలి, సెనగల్ దేశాలకు చెందిన రైతులు ఈసారి జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పౌష్టికాహారానికి చిరుధాన్యాలే...
సులువుగా.. చౌకగా పౌష్టికాహారం పొందేందుకు ఉన్న ఎకైక మార్గం చిరుధాన్యాల వినియోగం. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ జాతర ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలతో ఫుడ్ ఫెస్టివల్‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటిని తయారు చేసే విధానాలను సైతం ప్రజలకు వివరించారు.
ఈ పాత పంటల జాతరకు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వ్యవసాయం, చిరుధాన్యాల గురించి తమ చిన్నారులకు అవగాహన కల్పించుకునేందుకు నగరవాసులు తరలివచ్చారు. అనేక రకాల నేలలు... విత్తనాలు... సాగు విధానం గురించి తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. జిల్లాలోని జహీరాబాద్ కేంద్రంగా రోజుకో ఊరిలో నెల రోజుల పాటు ఈ పాత పంటల జాతర కొనసాగనుంది.
ఇవీ చూడండి : రేపే 'మకర జ్యోతి' దర్శనం.. భద్రత కట్టుదిట్టం